నుదుటన బొట్టు, చేతులకు గాజులును భార్య ధరించకపోయినట్లయ్యితే ఆ వివాహాన్ని ఆమె తిరస్కరించినట్లేనని గౌహతి హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె భర్తకు విడాకులు మంజూరు చేసింది. అసోంలో ఓ జంటకు 2012 ఫిబ్రవరిలో వివాహమైంది. పెండ్లి అయిన ఒక నెల తర్వాత విడిగా నివాసం ఉందామని భర్తను కోరింది. అయితే ఉమ్మడి కుటుంబాన్ని వీడేందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో 2013లో ఆమె భర్తను వీడి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. ఈ కేసులో వారు నిర్దోషులని గౌహతి హైకోర్టు తేల్చింది. మరోవైపు విడాకులు కోరుతూ భర్త తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య నుదుట సింధూరం పెట్టుకోవడం లేదని, చేతులకు గాజులు వేసుకోవడం లేదని, తమ సంప్రదాయాన్ని, పెండ్లిని ఆమె గౌరవించడంలేదని ఆరోపించాడు.

తన భార్య విడిగా ఉంటున్నదని, దీంతో తమకు సంతానం కూడా కలుగలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కాగా, ఫ్యామిలీ కోర్టు అతడి విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆ భర్త గౌహతి హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 19న సంచలన తీర్పు ఇచ్చింది. పెండ్లి అయిన హిందూ మహిళ, సంప్రదాయం ప్రకారం తన నుదుట సింధూరం పెట్టుకోకపోతే, చేతులకు గాజులు తొడిగేందుకు ఇష్టపడకపోతే భర్తతో జరిగిన వివాహాన్ని ఆమె తిరస్కరించినట్లుగా భావించాల్సి వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో కలిసి కాపురం చేయాలని దిగువ కోర్టు భర్తను ఆదేశించడం అతడ్ని హింసించడమేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆ భర్తకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు ఆ తీర్పులో పేర్కొన్నది.