తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద ప్రయాణికులతో వెళ్తూ మునిగిపోయిన బోటు వెలికితీత ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితమే రంగంలోకి దిగిన 25 మంది సభ్యుల బృందం రెండు కిలోమీటర్ల పొడవున్న ఇనుప తాడును బోటు మునిగిన ప్రాంతంలోకి వదిలింది. ఏదో బరువైన వస్తువు తాడుకు తగలడంతో బయటకు తీసే ప్రయత్నం ప్రారంభించింది.

అయితే ఐరన్‌ రోప్‌ మధ్యలోనే తెగిపోవడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. దీంతో ఈరోజు మరోసారి లంగరువేసి బోటు కోసం ప్రయత్నించాలని సత్యం బృందం సిద్ధమవుతోంది. వీరి ప్రయత్నాలు ఇలావుంటే ‘బోటు మునిగిపోయిన సమయంలో గోదావరిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. అందువల్ల బోటు మునిగిపోయిన చోటే ఉండడం అసాధ్యం. దిగువకు కొట్టుకుపోయి కూడా ఉండవచ్చు’ అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో బోటు కోసం ఘటనా స్థలిలో జరుగుతున్న ప్రయత్నాలు వృథాయేనని వీరి అభిప్రాయం. మరి సత్యం బృందం తరువాత అడుగు ఎటువైపు పడుతుందో చూడాలి.

బోటు వెలికితీత పనులు నిలిపివేత:

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు ప్రమాద ఘటనలో బోటు వెలికితీత పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉద్ధృతి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. గత మూడు రోజులుగా కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటు మునిగిన ప్రాంతంలో వెలికితీత పనులు చేపట్టిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదం జరిగి 19 రోజులు గడుస్తున్నా గల్లంతైన 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో బంధువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.