గోల్కొండ: ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం: షేక్‌పేట్‌కు చెందిన సంతోష్‌(36) నగరంలోని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి 2013లో పాత నగరానికి చెందిన కళ్యాణితో పెళ్లి అయింది. వీరికి అభిరామ్‌(6) కొడుకు ఉన్నాడు. అభిరామ్‌ కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో సంతోష్‌ను భార్య కళ్యాణి వేధిస్తోంది. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్‌లో పురుగుల మందు తెప్పించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్‌ డ్రింక్‌లో ఆ మందును కలిపి తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు.

సెల్ఫీ వీడియో:

సంతోష్‌ ఆత్మహత్య చేసుకునే ముందే ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన మరణానికి భార్య కళ్యాణి కారణమని స్పష్టం చేశాడు. ఇప్పటి వరకు మూడుసార్లు తనపై కళ్యాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారని, కేసులు, పంచాయితీలతో తనను ఇబ్బంది పెట్టారని రికార్డ్‌ చేశాడు. కళ్యాణి తల్లిదండ్రులు అరుణ, పండరినాథ్, కళ్యాణి సోదరుడు గణేష్‌, బాబాయి భీమ్‌ హత్యాయత్నం చేశారని ఆరోపించాడు.