బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక నెల వేతనాన్ని అడ్వాన్స్‌గా అందుకోనున్నారు. దీపావళి కన్నా ముందే ఉద్యోగులకు ఒక నెలలో రెండు జీతాలు అకౌంట్‌లో పడనున్నాయి. దీపావళికి ముందుగా ఒక నెల అడ్వాన్స్‌ జీతాన్ని బ్యాంక్ ఉద్యోగులకు ఇవ్వాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్-IBA దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల్ని కోరింది.

ఈ నిర్ణయం అమలులోకి వస్తే 14 లక్షల మందియ బ్యాంక్ ఉద్యోగులకు పండుగ వేళ అతిపెద్ద శుభవార్తే. ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వాలంటూ ఐబీఏ ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులకు లేఖ రాసింది. బ్యాంకులో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు, స్టాఫ్, ఆఫీసర్స్‌కు సాలరీ అడ్వాన్స్ ఇవ్వాలని ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వీజీ కన్నన్ లేఖలో కోరారు. ఫెస్టివల్ అడ్వాన్స్‌లో బేసిక్ వేతనం+డీఏ ఉంటుంది. 2019 నవంబర్ 1 నాటికి ఉద్యోగులుగా ఉండి, ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికి ఒక నెల వేతనం, ఇక 2017 నవంబర్ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య ఉద్యోగాల్లో చేరినవారికి 15 రోజుల వేతనాన్ని ఫెస్టివల్ అడ్వాన్స్‌గా ఇవ్వాలని ఐబీఏ కోరింది.

ఫెస్టివల్ అడ్వాన్స్‌గా ఇచ్చిన వేతనాన్ని తర్వాత వచ్చే బకాయిల్లో, వేతనాన్ని సవరించినప్పుడు అడ్వాన్స్ అడ్జస్ట్ చేయాలి ఐబీఏ సూచించింది. బ్యాంకు ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు అడ్వాన్స్ ఇవ్వడం అవసరం అని ఐబీఏ చెబుతోంది.