మహమ్మారి కరోనా భయం మానవత్వాన్ని మంటగలుపుతోంది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందుకు అద్దం పట్టే ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో చోటుచేసుకుంది. తన భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఓ ఏఎన్‌ఎం పడరాని పాట్లు పడ్డారు. రాత్రంతా వర్షంలోనే ఉండిపోయారు. వివరాలు: బుర్రిలంకకు చెందిన ఓ మహిళ ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త ఇటీవల కోవిడ్‌-19 బారిన పడటంతో అతడిని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఏఎన్‌ఎం కారణంగా తమకు కూడా కరోనా సోకుతుందనే భయంతో గ్రామస్తులు ఆమెను ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

దీంతో ఆమె రాత్రంతా వర్షంలోనే గడిపారు. ఈ విషయం గురించి సదరు ఏఎన్‌ఎం మాట్లాడుతూ: సొంత ఇంట్లోకి తనను అడుగుపెట్టనివ్వకుండా గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు గ్రామానికి సేవ చేసినందుకు ఇదేనా ఫలితం అంటూ వాపోయారు. కాగా మహమ్మారి సోకిందంటే చాలు సొంత వాళ్లను కూడా శత్రువులుగా భావించే రోజులు దాపురించిన తరుణంలో, సాధారణ ప్రజలతో పాటు ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు కూడా చేదు అనుభవాలు తప్పడం లేదు. ఇక కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్న ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం.