భర్తను తిట్టినందుకు ఓ ఎస్‌ఐని మహిళ చెంప మీద చాచికొట్టిన సంఘటన తమిళనాడులోని తిరు వెన్నెనల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విల్లపూరమ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అనంతుర్ గ్రామంలో శారతి (24) అనే మహిళ తన భర్త ముత్తురామన్‌తో కలిసి జీవిస్తోంది. వాళ్లకు ఒక గుడిసే ఉంది. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద వాళ్లకు ఇల్లు మంజూరైంది. ఈ ఇండ్లకు ప్రభుత్వం పైవేటు కాంట్రాక్టర్ సుభాష్ చంద్ర ఇండ్లను నిర్మిస్తున్నాడు. ఇల్లు నిర్మాణంలో సుభాష్ చంద్ర మోసం చేశాడని అతడితో ముత్తురామన్ గొడవపెట్టుకున్నాడు. వెంటనే సుభాస్ సంబంధించిన ద్విచక్రవాహనాన్ని ముత్తు స్వాధీనం చేసుకున్నాడు. సుభాష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తంగవేల్ అక్కడికి చేరుకొని ముత్తురామన్‌ను ప్రశ్నిస్తుండగా అతడు మద్యం మత్తులో ఉండడంతో సరైన సమాధానం ఇవ్వలేదు.

వెంటనే ముత్తురామన్ ను ఎస్‌ఐ దూషించడంతో అతడి భార్య శారతి పోలీస్ ఎస్ఐ చెంప మీద కొట్టింది. కానిస్టేబుల్ వద్ద నున్న మొబైల్ ఫోన్‌ను ముత్తురామన్ బలవంతంగా లాక్కుకున్నాడు. గ్రామస్థులు ఎదురుతిరిగే సరికి పోలీసులు తమ వాహనాలు వదిలి అక్కడి నుంచి పారిపోయారు. విల్లుపురమ్ డిఎస్‌పి నల్లశివమ్ తన సిబ్బంది, రెవెన్యూ ఉద్యోగులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి ఫోన్, పోలీస్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.