సినీ నటి, ‘సుందరా ట్రావెల్స్‌’ హీరోయిన్‌ రాధ తన రెండో భర్త అయిన ఎస్‌ఐ వసంత్‌రాజాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రవర్తనను అనుమా నిస్తూ వేధించడమే కాకుండా, హత్య చేస్తానని బెదిరిస్తున్నారంటూ స్థానిక సెంట్‌థామస్‌ మౌంట్‌ జాయింట్‌ కమిషనర్‌ నరేంద్రన్‌ నాయర్‌కు ఆమె శనివారం ఫిర్యాదు చేసింది. ‘సుందరా ట్రావెల్స్‌’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈమెకు ఆ తరువాత సినీ అవకాశాలు రాలేదు. దీంతో ఒక నిర్మాతను పెళ్ళి చేసుకుని కొంతకాలం సంసారజీవితం గడిపింది. ఆ తర్వాత వారిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని, ఎస్‌ఐ వసంత్‌రాజాను రెండో పెళ్ళి చేసుకుంది. అయితే, అనుమానం పేరుతో తనను ఎస్‌ఐ వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆమె గతంలో విరుగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరిని పిలిచి సమాధానం పరిచారు. అక్కడ నుంచి కొంతకాలం కలిసేవున్నారు ఇప్పుడు మరోమారు తన రెండో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంత్‌రాజాతో పాటు ఆయనకు సహకరిస్తున్న ఇన్‌స్పెక్టర్లు ఇళంవరుది, భారతి అనే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.