భర్త తనకు కొత్త చీర కొనివ్వలేదనే కోపంతో నవ వధువు ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అలీఘడ్ నగరంలో వెలుగుచూసింది. నగరంలోని సిద్ధార్థ‌నగర్‌కు చెందిన అమిత్ అదే నగరానికి చెందిన అంజనను ఈ ఏడాది మే 13వతేదీన వివాహమాడారు. శనివారం ఓ ఫంక్షన్ కు వెళ్లేందుకు కొత్త చీర కొనివ్వమని అంజన భర్త అమిత్ ను కోరింది. ఇప్పుడు కొత్త చీర కొనివ్వలేనని, ఇంట్లో ఉన్న చీరల్లో ఏదో ఒకటి కట్టుకోమని చెప్పి భర్త అమిత్ బయటకు వెళ్లాడు. భర్త కొత్త చీర కొనివ్వకుండా వెళ్లాడనే కోపంతో భార్య అంజన తన పడకగదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా అదనపు కట్నం తీసుకురమ్మని అత్తింటి వారు తన కూతురిన్ని వేధించినందువల్లే అంజన ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి అత్తర్ సింగ్ ఆరోపించారు. పోలీసులు అంజన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.