మధ్యప్రదేశ్ లోని టికామ్‌ఘర్ జిల్లా కేంద్రంలోని జతారా పోలీస్ స్టేషన్ లో మొన్న ఆదివారంనాడు ఓ కీలకమైన కేసు నమోదైంది. 26ఏళ్ల వ్యక్తి తన భార్య(24)పై ఫిర్యాదు చేశాడు. ఈనెల 7వ తేదీన ఇంట్లో సెక్స్ కోసం ప్రయత్నించగా, భార్య కత్తితో పురుషాంగాన్ని కోసేసిందని, రక్తం కారిపోతున్న స్థితిలో ఆస్పత్రిలో చేరానని, ఆపరేషన్ కారణంగా ఆలస్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు. డాక్టర్ల రిపోర్టులు పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అవతలి కోణం తెలిసింది, టికామ్‌ఘర్ పట్టణంలోని రాంనగర్ కు చెందిన ఆ వ్యక్తికి 2019లో ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. క్రమంగా అవి పెద్దవి కావడంతో పరిస్థితి తన్నుకునేదాకా వెళ్లింది. ఒక దశలో భర్త ఆగడాలను భరించలేనంటూ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, ఇరు కుటుంబాలు, కుల పెద్దలు జోక్యం చేసుకొని ఆ జంటకు సర్దిచెప్పారు.

గొడవలు పెట్టుకోకుండా బుద్ధిగా సంసారం చేసుకోండంటూ కాంప్రమైజ్ చేసి పంపారు. దీంతో కొద్ది కాలం కిందటే ఆమె భర్త దగ్గరికి తిరిగొచ్చేసింది. మళ్లీ కొద్ది రోజులకే ఇద్దరి కొట్లాట మొదలైంది. ఈక్రమంలోనే ఈనెల 7న ఇంట్లో అనూహ్య ఘటన జరిగింది. తనకు ఇష్టం లేదని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా దుస్తులు తొలగించి, పశువు మాదిరిగా బలవంతంగా సెక్స్ చేయడానికి ప్రయత్నించాడని భార్య పోలీసులకు వివరణ ఇచ్చుకుంది. బలవంతపు సెక్స్ భరించలేక పట్టరాని కోపంలోనే తానీ పని చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవల సంగతి ఎలా ఉన్నా, ఒక వ్యక్తిని మారణాయుధంతో ప్రమాదకరంగా గాపర్చడం నేరం కిందికే వస్తుందని, కాబట్టే ఆమెపై ఐపీసీ సెక్షన్ 324 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని జతారా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ త్రివేంద్ర త్రివేది తెలిపారు.