జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడటం విషాదం నింపింది. కృష్ణానగర్‌కు చెందిన ఆకోజు కృష్ణమూర్తి అప్పుల బాధ తాళలేక గత నెల 21 న భార్య శైలజ, కుమారుడు ఆశ్రిత్, కుమార్తె గాయత్రిలతో కలిసి పురుగు మందు తాగాడు. వారందరినీ మొదట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మొదట అదే నెల 24న కృష్ణమూర్తి మృతి చెందగా ఈనెల 5న కుమార్తె గాయత్రి బుధవారం కుమారుడు ఆశ్రిత్, గురువారం ఉదయం భార్య శైలజ మృతి చెందారు. శైలజ, ఆశ్రిత్ మృతదేహాలను గురువారం సాయంత్రం జగిత్యాలకు తెచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లీకుమారులిద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించడం చూపరులను కంటతడి పెట్టించింది.
జగిత్యాల జిల్లాలో ఫ్యామిలీ సూసైడ్ కలకలం రేపింది. బంగారం, వెండి ఆభరణాలు చేసే ఆకోజు కృష్ణమూర్తి అనే వ్యక్తి అవసరాల నిమిత్తం 30 లక్షల అప్పులు చేశాడు. ఏడాదిన్నర క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా కొన్ని రోజులకు ఉమ్మడి ఆస్తిని విక్రయించారు. అయితే అప్పుల బాధతో ఉన్న కృష్ణమూర్తి విషయమై బంధు, మిత్రులు సైతం ఆసరాగా నిలవకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆర్ధిక ఇబ్బందులల్లో తనకు అప్పుల ఊబిలోంచి బయటపడే మార్గం లేకపోవడంతో కుటుంబ సభ్యులకు పురుగుల మందు తాగించి అటుపై తాను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.