భర్త వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన ఓ మహిళపై ఆమె భర్త అమానుషంగా దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు:

మౌలాలీలోని ఆర్టీసీ కాలనీ శివానందనగర్‌లో నివాసం ఉండే మహేష్‌ భార్య కళావతి మౌనేష్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య కళావతి పథకాన్ని రచించింది. భర్త ఇంట్లో నిద్రించే సమయంలో యాసిడ్‌ దాడి చేసింది. ఈ దాడిలో మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కళావతి తన ఇద్దరు ఆడ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.

నేర ప్రవృత్తి కలిగిన తన భార్య వద్ద పిల్లలు ఉంటే జీవితం నాశనం అవుతుందని, తన ఇద్దరు కుమార్తెలను తనకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని, లేనిపక్షంలో స్టేట్‌ హోంకు తరలించి చదివించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మహేష్‌ ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు కమీషన్‌ ఎదుట బుధవారం విచారణ జరగాల్సి ఉండేది.

విచారణకు మహేష్‌తో పాటు భార్య కళావతి హాజరైంది. మౌనేష్‌ కూడా అక్కడకు వస్తాడనే విషయం ముందుగా తెలిసింది. అయితే కళావతి పరిచయం అనంతరం తన భర్త మౌనేష్‌ ఇంటికి రావడం లేదని శాంతి అనే మహిళ బుధవారం మానవహక్కుల కమిషన్‌కు వచ్చింది. అక్కడ మౌనేష్‌ను భార్య శాంతి నిలదీసింది. భార్య ప్రశ్నించడాన్ని భరించలేని మౌనేష్‌ ఆమెపై దాడిచేశాడు. దాడిలో శాంతి మూతి పండ్లు రాలిపోయాయి. తీవ్ర రక్తస్రావం అయ్యింది. బాధితురాలిని కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య తన చాంబరులోనికి ఆహ్వానించి సమస్యను తెలుసుకున్నారు. కమిషన్‌ ఎదుట భార్యపై భర్త దాడి చేయడంపై కమీషన్‌ ఛైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.