ఇటీవల తెదేపాను వీడిన సాదినేని యామిని శర్మ భాజపాలో చేరారు. శనివారం కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకొన్నారు. గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆమెకు పార్టీ కండువా కప్పి కమల దళంలోకి ఆహ్వానించారు. గతేడాది నవంబర్‌ మాసంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిదని రాజీనామా సందర్భంలో ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. తన వ్యక్తిగతమైన, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర బలమైన కారణాలతో తెదేపాను వీడుతున్నట్టు స్పష్టంచేసిన ఆమె తాజాగా భాజపాలో చేరడం గమనార్హం.