వీడెవడో అతితెలివి క్రిమినల్ ! భార్యను చంపేందుకు నాగుపామును కొన్నాడు ! ఇంటిలో దాచిపెట్టాడు ! భార్యను చంపేసి , ఆ తరువాత పామును చంపి, దాని కోరలను చనిపోయిన భార్య చేతిలో గుచ్చి నాటకం ఆడాడు. పాముతో పోరాడి చచ్చిపోయిందని మూకాయించి బుక్కైపోయాడు ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వెలుగుచూసింది. అతడు మాజీ బ్యాంక్‌ మేనేజర్‌ అమితేష్‌ పటేరియా..

భార్య శివాని (35)ని గొంతునులిమి హత్య చేసిన నిందితుడు తన భార్య చేతిలో చనిపోయిన పాము కోరలను ఉంచి పాముకాటుకు గురైందని ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు. డిసెంబర్‌ 1న కుటుంబ కలహాలతో పటేరియా తన భార్యను హత్య చేశాడని, భార్య శవం చేతిలో మరణించిన పాము కోరలను ఉంచి పాముకాటుకు ఆమె చనిపోయిందని పోలీసులను తప్పుదారి పట్టించాడని సీనియర్‌ పోలీస్‌ అధికారి శైలేంద్ర సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు.

పోస్ట్‌మార్టం నివేదికలో ఊపిరిఆడకుండా చేయడంతో శివానీ మరణించినట్టు వెల్లడైందని తెలిపారు. భార్యను హత్య చేసేందుకు 11 రోజుల ముందే రాజస్తాన్‌లోని అల్వార్‌ నుంచి నల్ల తాచుపామును రూ 5000 వెచ్చించి పటేరియా కొనుగోలు చేశాడని, కప్‌బోర్డ్‌లో దాన్ని దాచాడని చౌహాన్‌ తెలిపారు. భార్యను హత్య చేసిన అనంతరం సాక్ష్యాలను కనుమరుగు చేసేందుకు పటేరియా పామును చంపాడని చెప్పారు. పటేరియాపై వివిధ సెక్షన్లతో పాటు పామును చంపినందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నేరారోపణలపై అమితేష్‌ పటేరియా సోదరి రిచా చతుర్వేది(38) తండ్రి ఓం​ ప్రకాష్‌ పటేరియా (73) లను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.