కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు ఓ భర్త పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు, బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది. కోట జిల్లా కునాడి లో నివసించే రవి అనే యువకుడు పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ సుమన్ అనే మ్యారేజి బ్రోకర్‌ను సంప్రదించాడు. సుమన్ కొన్ని ఫోటోలు చూపించాడు. వాటిలో కోమల్ అనే యువతి రవికి నచ్చింది. ఆమె వివరాలు అడగ్గా కోమల్‌కు తల్లితండ్రులు లేరని అన్నయ్య ఒక్కడే ఉన్నాడని చెప్పాడు. సరే కోమల్‌ను పెళ్లి చేసుకుంటానని రవి చెప్పాడు. అయితే యువతి అన్నయ్యని కలవాలని మ్యారేజి బ్రోకర్‌తో రవి అన్నాడు. కోమల్ వాళ్ల అన్నయ్య సోనూ కార్పరే, సుమన్, రవి హోటల్‌లో కలిశారు. మేము కట్నం ఇచ్చుకోలేమని కోమల్‌ వాళ్ల అన్నయ్య ముందే చెప్పుకొచ్చాడు. తక్కువ సమయంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి పెళ్లి ఒక గుళ్లో జరిపాడు సోనూకార్పరే.

తరువాత కోమల్ తన భర్తతో కాపురానికి వెళ్లింది. పెళ్లైన మూడో రోజుకే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కనిపించడం లేదని భర్త స్ధానిక పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయాలు బయట పడ్డాయి. మ్యారేజి బ్రోకర్ సుమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండోర్ కు చెందిన సోనూ కార్పరే, కోమల్ భార్యా భర్తలని ఈజీ మనీ సంపాదించేందుకు ఈ మార్గం చెప్పారని తనకు డబ్బులు వస్తాయని ఈ సంబంధం కుదిర్చానని వెల్లడించాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సోనూకార్పోరేను, కోమల్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.