హ్యాపీగా పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేశాడు. దంపతులకు పిల్లలు ఉన్నారు. భర్త వ్యసనాలకు బానిస అయ్యాడు. ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో భర్తకు ఓ ఐడియా వచ్చింది. భార్య కిడ్నీ అమ్మేవేసి ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలని స్కెచ్ వేసి, భార్యకు మాయమాటలు చెప్పిన భర్త ఆమె కిడ్నీ అమ్మేయడానికి ప్లాన్ వేశాడు. భార్యకు తెలియకుండా ఆమె కిడ్నీని దొంగలించిన విషయం నాలుగేళ్ల తర్వాత బయటపడింది. ఎట్టకేలకు పోలీసులు నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒడిషా రాస్ట్రంలో చోటుచేసుకుంది. ఒడిషాలోని కొటమెట గ్రామంలో ప్రశాంత్ కందూ-రంజిత నివసించేవారు. ప్రశాంత్ కందూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ శరణార్థిగా నివసిస్తున్నాడు. ప్రశాంత్ కందూ- రంజితలకు వివాహం జరిగి 12 ఏళ్లు అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2018లో నీ కిడ్నీలో రాళ్లు తీసేపిస్తా అని భార్య రంజితను నమ్మించి ఆమెను భువనేశ్వర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు ప్రశాంత్. అయితే తన భర్తకు తన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్దో అని మురిసిపోయింది భార్య. అదే సమయంలో భర్త, డాక్టర్‌తో కలిసి అతడి ఒక కిడ్నీని తీసి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేశాడు.

అనస్థీషియా మత్తులో ఉండటంతో ఆ మహిళకు ఈ విషయం ఏమీ తెలియలేదు. అయితే ఇటీవల పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో రంజిత హాస్పిటల్ కు వెళ్లింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. మీరు ఒక కిడ్నీతోనే ఉన్నారు అని డాక్టర్లు చెప్పిన మాట విన్న రంజిత షాక్ అయింది. ఆ తర్వాత ఆరా తీయగా భర్త 2018లో తనను తీసుకెళ్లిన అదే హాస్పిటల్ లో చేరిన ఒకరికి అమ్ముకున్నాడని కనిపెట్టింది. దీంతో గత నెల 24న మల్కన్ గిరి పోలీస్ స్టేషన్ లో తన భర్తపై కంప్లెయింట్ చేసింది. అంతేకాకుండా,ఎనిమిది నెలల క్రితం భర్త ప్రశాంత్ ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడని,ఆ తర్వాత బెంగుళూరు వెళ్లిపోయాడని రంజిత తన ఫిర్యాదులో పేర్కొంది. రంజిత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంత్‌ను పట్టుకోవడానికి ఒక బృందాన్ని బెంగళూరుకు పంపారు. గతవారం పోలీసులు ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రంజిత తన తల్లిదండ్రులతో ఉంటోంది.