భార్య,కొడుకు ఉండగా మరో మహిళతో కాపురం పెట్టిన వ్యక్తిని భార్య తరపు బంధువులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా చిన్న బొంకూర్ గ్రామానికి చెందిన కొండి సంపత్ కరీంనగర్ లో ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. సంపత్ కు 2016లో మానకొండూరు మండలం గూడూరుకి చెందిన భాగ్యలక్ష్మీతో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. సంపత్ కు ఇటీవల మరో మహిళతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏకంగా ఆ మహిళతో కరీంనగర్ లో కాపురం పెట్టాడు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం సంపత్ భార్య భాగ్యలక్ష్మీకి తెలిసింది.

దీంతో భాగ్యలక్ష్మీ తన బంధువులతో కలిసి కరీంనగర్ లో సంపత్ కాపురం పెట్టిన ఇంటికి వెళ్లింది.మరో మహిళతో సంపత్ ఉండగా ఆమె రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకుంది. అనంతరం వారంతా సంపత్ కు దేహశుద్ది చేశారు. సంపత్ గతంలో కూడా నలుగురు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.