ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ తెలిపిన వివరాలు: నారాయణపేట్‌ జిల్లా మద్దూర్‌ గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు మంగలి కృష్ణ (25) మూడు సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి అంగడిపేట్‌లో నివాసముంటున్నాడు. సెలూన్‌ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి రెండు సంవత్సరాల క్రితం పల్లవి అనే ఆమెతో వివాహమైంది.

గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణ పలువురి వద్ద అప్పులు చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను పది రోజుల క్రితం పుట్టింటికి పంపాడు. అప్పులతో సతమవుతున్న కృష్ణ బుధవారం రాత్రి 7గంటల సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క గదిలో ఉంటున్న అతని తండ్రి, తమ్ముడు గురువారం వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..