ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రసవానికి డబ్బుల్లేక ఓ భర్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. తోటి ప్రయాణికుడి పర్సు కొట్టేసి కిరాతకంగా హతమార్చాడు. డెడ్‌బాడీ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు అతని పక్కనే ఉన్న మరో ప్రయాణికుడిపై అనుమానం వచ్చింది. అతన్ని గాలించి పట్టుకోవడంతో నిందితుడు తానే చంపేశానని ఒప్పుకున్నాడు. అయితే అతను చెప్పిన సమాధానం విని పోలీసులే అవాక్కయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లాకు చెందిన నీరజ్ జైశ్వాల్ ఘట్కోపర్‌లోని ఓ జిప్పుల తయారీ కంపెనీ పనిచేసేవాడు. తన సోదరులతో కలసి మన్‌ఖుర్ద్‌లో నివాసం ఉండేవాడు. అనూహ్యంగా జైశ్వాల్ లోకల్ ట్రైన్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. అతని శవం పన్వేల్ సీఎస్‌ఎంటీ లోకల్ ట్రైన్ లగేజ్ కంపార్ట్‌మెంట్ వద్ద పడి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై కత్తిపోట్లు ఉండడంతో ఎవరో దారుణంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతనితో ప్రయాణం చేసిన వ్యక్తే హతమార్చి ఉండొచ్చని అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. జైశ్వాల్ కుర్లా స్టేషన్ ట్రైన్ ఎక్కినట్లు గుర్తించారు. అయితే అతనితో ప్రయాణం చేసిన వారిలో ఒక్కరు మినహా అందరూ మధ్యలో దిగిపోయారు. ఆ ఒక్కడిని పోలీసులు షేక్‌గా గుర్తించారు. అతను గోవండి స్టేషన్‌లో ట్రైన్ ఎక్కి జీటీబీ నగర్‌లో ట్రైన్ నుంచి దూకేయడం గమనించారు.

అందరూ దిగేవైపు కాకుండా అవతలి వైపు నుంచి దూకి పారిపోయాడు. షేక్‌‌పై అనుమానంతో పోలీసులు గాలించి పట్టుకుని స్టేషన్‌కి తరలించారు. నిందితుడిని తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య కడుపుతో ఉందని ప్రసవం చేయించేందుకు డబ్బుల్లేక దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. జైశ్వాల్ పర్సు, సెల్‌ఫోన్ చోరీ చేశానని అతను పోలీసులకు చెప్తాడేమోనన్న భయంతో కత్తితో పొడిచి చంపేశానని ఒప్పుకున్నాడు. అయితే అతని పర్సులో దొరికిన డబ్బులు ఎంతో తెలిసి అంతా కంగుతిన్నారు. ఆ పర్సులో కేవలం రూ.70 మాత్రమే ఉన్నాయట. కేవలం రూ.70 కోసం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుని జైలుపాలయ్యాడు యువకుడు..