కొత్త పెళ్లి కూతురు భర్తను చంపేందుకు నిజంగా ప్రయత్నం చేసిందా? మజ్జిగలో నవవధువు పురుగుల మందు కలిపిందా? అదే నిజమైతే ఆ యువతి భర్తతోపాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? పెళ్లైన వారానికే మజ్జిగలో విషం కలిపిందంటూ వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి యువతి కుటుంబసభ్యులు అడుగుతున్న ప్రశ్నలివి. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ కొత్త పెళ్లికొడుకే వివాహబంధం నుంచి బయటపడేందుకు కొత్త నాటకం ఆడాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి…

జిల్లాలో పాయిజన్‌ కేసు కీలక మలుపు తీసుకుంది. భార్య విషం ఇచ్చిందంటూ లింగమయ్య డ్రామా ఆడినట్లు తేలింది. భార్య ఇచ్చిన మజ్జిగ తాగకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన లింగమయ్య ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరాడు. భార్య నాగవేణి తనను చంపేందుకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చిందని బంధువులకు చెప్పడంతో కలకలం రేగింది. అంతా నవ వధువు నాగవేణిని అనుమానించారు. అయితే పోలీసులు, నాగవేణి బంధువులు కలిసి గట్టిగా నిలదీయడంతో లింగమయ్య డ్రామా బయటపడింది. కర్నూలు జిల్లాకు చెందిన లింగమయ్యకు అదే ప్రాంతానికి చెందిన నాగవేణితో 10 రోజుల క్రితం పెళ్లయింది. నాగవేణి బంధువులు రూ.8 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు.

అయితే నాగవేణి అంటే లింగమయ్యకు ఇష్టం లేదు. అంతకుముందు మరో అమ్మాయిని ప్రేమించిన లింగమయ్య భార్యను వదిలించుకునేందుకు మొదటి రోజు నుంచే ప్రయత్నించాడు. చివరకు భార్యే విషం ఇచ్చిందని డ్రామా ఆడి, ఆమెను జైలుకు పంపించేందుకు తెగించాడు. వారం రోజులుగా లింగమయ్య తమ బిడ్డను వేధిస్తున్నాడని నాగవేణి బంధువులు వాపోయారు. చివరకు నాగవేణి విషం కలిపి ఇచ్చిందంటూ నాటకం ఆడి, తమ పరువు తీశాడని మండిపడుతున్నారు. లింగమయ్య డ్రామా బయట పడటంతో ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించాడు. తనకు భార్య విషం ఇవ్వలేదని చెప్పుకొస్తున్నాడు. కేవలం అనుమానంతోనే ఆస్పత్రిలో చేరానంటున్నాడు…