కొత్తగా పెళ్లయిన ఉగాండా ఇమాం రెండు వారాల తర్వాత తన భార్య స్త్రీ కాదని, పురుషుడని తేలడంతో షాక్‌లో మునిగిపోయారు. ఇమాం మహ్మద్‌ ముతుంబా సరిగ్గా పదిహేను రోజుల కిందట తన ‘భార్య’తో వివాహ ఒప్పందం చేసుకున్నారు. పెళ్లికి ముందు తాము శారీరకంగా కలవలేదని, వివాహానంతరం కూడా వధువు తనకు రుతుక్రమం నడుస్తోందని చెప్పారని ఇమాం డైలీ నేషన్‌ పత్రికతో మాట్లాడుతూ వాపోయారు.

ఇంతచేసి ఆమె స్ర్తీ కాదని గుర్తించింది ఇమాం కాకపోవడం గమనార్హం. ఇమాం భార్య గోడ దూకి మరీ తమ ఇంట్లో వస్తువులను చోరీ చేయడంతో ఈ విషయం వెల్లడైందని పొరుగింటి వారు తేల్చిచెప్పారు. తమ ఇంట్లో నుంచి ఆమె టీవీ, దుస్తులను దొంగిలించారని అప్పుడే తాము ఆమెను అతడుగా కనుగొన్నామని వారు చెప్పుకొచ్చారు. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇమాం ఆమె ‘భార్య’ ను పిలిపించి విచారణ చేపట్టారు.

మహిళా పోలీస్‌ అధికారి అనుమానితురాలిని పరిశీలించగా ఆమె కాస్తా స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడని తేలడంతో అవాక్కయ్యారు. ఇమాంను మోసం చేసినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమాంను డబ్బు కోసమే స్త్రీలా నటించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు పేర్కొన్నాడు. కాగా ఓ మసీదులో బురఖా ధరించిన నిందితుడిని చూసి తాను మోసపోయానని, ఆ సమయంలో ఆమెకు ప్రపోజ్‌ చేయగా అంగీకరించిందని, అయితే తన తల్లితండ్రులకు వధువు కట్నం చెల్లించేవరకూ తాము శారీరకంగా కలవద్దని తనతో చెప్పినట్టు బాధిత ఇమాం వాపోయారు. నిందితుడిపై చీటింగ్‌, చోరీ కేసులను నమోదు చేశామని పోలీసులు తెలిపారు.