ఎటువంటి ఆర్బాటం లేకుండా ఆమె కాళేశ్వరంలోని ఓ హోటల్‌లో టీ తాగి వెళ్లారు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్‌, మహాముత్తారం, కాటారం ప్రాంతాల్లో పోలీసు అధికారులు పర్యటించాలంటే కాస్త వెనకడుగు వేస్తారు. కాని ఓ మహిళా పోలీసు అధికారి ఏకంగా తన అంగరక్షకులతో బైక్‌పై స్వారీ చేస్తూ సుమారు వంద కిలోమీటర్లు అదీ సాయంత్రం వేళ పర్యటించి తిరుగు పయనమయ్యారు.

వివరాల్లోకి వెళ్తే: మహాముత్తారం సీర్పీఎఫ్‌ 58వ బెటాలియన్‌కు చెందిన డీఎస్పీ మీనాక్షి భట్‌ ద్విచక్ర వాహనాలతో వచ్చి సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ, లక్ష్మీ పంపుహౌస్‌, సరస్వతి బ్యారేజీలను చూశారు. తమ బెటాలియన్‌కు సంబంధించి జవాన్లు ప్రాజెక్టు ప్రాంతాల్లో భద్రత విధుల్లో ఉన్న నేపథ్యంలో ఆమె పర్యటించి పరిశీలించారు. పంపుహౌస్‌ నుంచి ఆమె నేరుగా కాళేశ్వరం గోదావరి తీరం వెళ్లి ఉభయ నదుల ప్రవాహాన్ని చూసి ముచ్చటపడ్డారు. స్వామి వారి చెంతన ఆమె పూజలు నిర్వహించారు. ఎటువంటి ఆర్బాటం లేకుండా ఆమె కాళేశ్వరంలోని ఓ హోటల్‌లో టీ తాగి వెళ్లారు.