కోవిడ్-19 లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ప్రజలు తమకు నచ్చినట్టు బయట తిరగడానికి వీల్లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

అవసరంలో ఉన్నవారికి ఆహారం పంచిపెట్టడం వంటి పనులు ‘‘మెచ్చుకోదగిన’’ విషయాలే అయినా ఆ కారణంతో కూడా స్వతంత్రంగా బయటకు రావడానికి వీల్లేదని పేర్కొంది. కొల్లాం జిల్లాలోని నెండుపనలో ఉచిత ఆహార పంపిణీ కోసం అనుమతి కోరుతూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌‌పై హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

‘‘ఏదైనా సాయం చేయదల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచెయ్యొచ్చు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడవాలి తప్ప ఎవరికి వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తామంటే కుదరదు. లేదంటే రేపటి నుంచి రెస్టారెంట్లు అన్నీ తెరుచుకుంటాయి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ప్రభుత్వంతో కలిసి తాము పనిచేస్తామని కోరినా జిల్లా కలెక్టర్ తిరస్కరించారని పిటిషనర్ ఆరోపించారు. అయితే తమకు అలాంటి విజ్ఞప్తులేవీ రాలేదని కలెక్టర్ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ తంపన్ ధర్మాసనానికి విన్నవించారు…