హైదరాబాద్: తనను కోవర్టు అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని గడ్డిపోచలా వదులుకున్నప్పుడు కేటీఆర్‌ ఎక్కడున్నారని, తనను కోవర్టు అనడానికి ఆయనకున్న స్థాయేంటని ప్రశ్నించారు. తనను అనే ముందు ఆయన చెల్లెలి సంగతి చూసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ ఈడీ, ఐటీ దాడులు ఎవరి అనుచరుల కంపెనీల మీద జరుగుతున్నాయో, ఎవరు అరెస్టు అవుతున్నారో గమనించాలన్నారు.

‘కేటీఆర్‌ మీద ఎందుకు ఈగ వాలడం లేదు? ఇది చాలదా కోవర్టులెవరో తెలియడానికి. కోవర్టు కాకుంటే ఈపాటికి ఆయన జైల్లో ఉండే వారన్న సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాలా?’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ‘కోమటిరెడ్డి అంటే నిప్పు. నిజాయతీకి మారుపేరు, కల్వకుంట్ల అంటే కమీషన్లకు మారుపేరు. కాదని చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నాయా కేటీఆర్‌? దమ్ముంటే రా..ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ నేను సిద్ధం’ అని వెంకట్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

ఆ విషయం కేటీఆర్‌కు ఎందుకు..?

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన కొందరు విలేకరులు విదేశీ పర్యటనపై ప్రశ్నించగా, అది తన వ్యక్తిగతమని తెలిపారు. ‘మునుగోడు ప్రచారానికి వెళ్లాలా.? వద్దా అనేది నా ఇష్టం. కేటీఆర్‌కు ఎందుకు? ప్రచారానికి వెళ్లాలని ఉంది. కానీ పార్టీలో కొందరు చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెందా. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని సమాధానమిచ్చారు.