నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు ఒక TRS ఎమ్మెల్యే ఆ పార్టీ మంత్రి హరీష్ రావుకు సినిమా చూపించబోతున్నాడు. సినిమా అంటే మీరు అనుకునే సినిమా కాదండీ బాబూ! అచ్చమైన తెలుగు సినిమా. రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు విడదీయరాని అనుబంధం ఉంది. ఎప్పట్నుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది.
ఇప్పుడు ఓ TRS ఎమ్మెల్యే సినిమాను నిర్మించాడు. అదే సినిమాను తమ పార్టీ మంత్రికి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆయనే రసమయి బాలకిషన్. ఈయన నిర్మాతగా మారి రసమయి ఫిల్మ్స్ పతాకంపై బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా నిర్మించాడు. టి ప్రభాకర్ దీనికి దర్శకుడు. ఒకప్పుడు బతుకమ్మ, ఆల్ రౌండర్ లాంటి సినిమాలు చేసిన ఈయన ఇప్పుడు బిత్తిరి సత్తితో సినిమా చేస్తున్నాడు.
అక్టోబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. తుపాకి రాముడు ప్రీ రిలీజ్ వేడుకకు ఈటెల, హరీష్ రావు లాంటి మంత్రులు హాజరయ్యారు. అంతేకాదు కొన్నేళ్లుగా సినిమాలు చూడటం మానేసిన హరీష్ రావు ఈ చిత్రాన్ని చూస్తానని మాటిచ్చాడు. తోటి ఎమ్మెల్యే నిర్మించిన సినిమా కావడంతో ఆయన ఆసక్తిగా తుపాకి రాముడు చూస్తానని చెప్పారు.