మద్యం మత్తులో కన్నతల్లినే పొడిచి చంపాడు కొడుకు. ఈ దారుణ సంఘటన ఎస్ఆర్ నగర్ పరిధిలోని బల్కంపేటలో జరిగింది. కర్ణాటకకు చెందిన 57 ఏళ్ల సంగీత బల్కంపేటలో కొడుకు సంతోశ్(24)​తో కలిసి నివాసముంటోంది. సంగీతకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. చిన్న కొడుకైన సంతోశ్​కు మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. చెడు అలవాట్లకు బానిసైన సంతోశ్​ను శనివారం తల్లి మందలించగా కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపేశాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు మాట్లాడుతూ: శనివారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు హత్య జరిగినట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. అయితే సంఘటన స్థలానికి చేరేలోపే సంగీత మరణించినట్లు తెలిపారు. మద్యం మత్తులో తల్లిని చిన్న కొడుకు సంతోష్ కత్తితో పొడిచి చంపినట్లు తెలిపారు. హత్య జరిగిన సంఘటన స్థలానికి చేరుకున్న వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దికి, పంజాగుట్ట ఏసీపీ గణేష్ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.