‌మద్యం మత్తులో ఓ మహిళ వీరంగం సృష్టించిన సంఘటన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సింగరేణి కాలనీకి చెందిన మునావత్‌ పద్మ, శ్రీను గురువారం రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా చంపాపేట రోడ్డులోని మినర్వ గార్డెన్‌ వద్ద చార్మినార్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. కారు డ్రైవర్‌ను బ్రీత్‌ ఎన్‌లైజర్‌తో పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు.

దీంతో కారులో మద్యం మత్తులో పద్మ, శ్రీను కిందకు దిగి నడి రోడ్డుపై బైఠాయించి నా కారును ఎలా సీజ్‌ చేస్తారని ఆందోళన చేపట్టారు. కారు వదిలిపెట్టడానికి సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ రూ. 5 వేలు డిమాండ్‌ చేశాడని ఆరోపించారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని, అంత డబ్బు తమ వద్ద లేదని పద్మ ట్రాఫిక్‌ పోలీసులతో వాగ్వివాదానికి దిగింది.

కారు డ్రైవర్‌ మద్యం సేవించలేదని, వెనుక సీటులో ఉన్న తాము మద్యం తాగినట్లు శ్రీను తెలిపారు. దీనిపై సీఐ ఈశ్వర్‌గౌడ్‌ వివరణ ఇస్తూ తాము ఎవరినీ డబ్బులు డిమాండ్‌ చేయలేదని, మద్యం మత్తులోకారు డ్రైవింగ్‌ చేస్తున్నందునే సీజ్‌ చేసినట్లు తెలిపారు. విధులకు ఆటంకం కల్గించినందుకు వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు….