బౌద్ధమతంలో ఉన్నకొన్ని సూత్రాలనైనా పాటిస్తే అందరూ గొప్ప వారు అవుతారని టూరిజంశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బౌద్దమతంలో పేర్కొన్న పలు జీవిత సత్యాలు మానవాళికి మేలు చేస్తాయన్నారు. మనుషులందరికీ జ్ఞానం కలిగించింది బౌద్దమతం మాత్రమేనని అన్నారు. శనివారం ఎంసిహెచ్‌ఆర్‌డి ఆడిటోరియంలో టూరిజం, ఆర్కియాలజీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన బౌద్ద పురావస్తుశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సు ‘ తెలంగాణ బౌద్ధసంగితి-2019’ ఆయన న్రపారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశంలో కులం లేదు, మతం లేదంటారు. కానీ అవన్నీఇంకా రూపు మాసిపోలేదన్నారు. మనిషిని కుల మతాలకతీతంగా చూడాలని సూచించారు. కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చూపాలని అన్నారు . ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్నా భారత దేశం ఇంకా అభివృద్ధిలో వెనుకబడే ఉందన్నారు. ప్రపంచంలోనే బుద్దవనం ప్రాజెక్టు నెంబర్‌వన్‌గా ఉందన్నారు.

పనిగిరిలో ఆర్కియాలజీ డిపార్ల్‌మెంట్‌ అధికారులు తెలికితీసిన బుద్ద విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ప్రాంతాలు మరెన్నో ఉన్నాయన్నారు. బుద్దవనం ప్రాజెక్టు అంటే టూరిజం ప్రాజెక్టు కాదని ఇది నాలెడ్జ్‌ సెంటర్‌గా ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి బౌద్ద ఆర్కియాలజి ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.