వరంగల్‌: నగరం త్వరలో రెండు జిల్లాలుకాబోతోంది. హన్మకొండ, వరంగల్‌గా కొత్త అవతారం ఎత్తనుంది. ఈ క్రమంలో రెండు ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజాగా వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిని అత్యాధునికంగా నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. దీంతో వైద్య కేంద్రంగా అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతో ఉన్నారు. అయితే నగరంలో గతంలో మంజూరైన ప్రాజెక్టులు, కొత్తగా ప్రకటించినవి అనేకం ఉన్నాయి. వీటిల్లో కొన్ని వరంగల్‌, కొన్ని హన్మకొండ పరిధిలోకి రానున్నాయి. కొన్నేమో రెండు జిల్లాల పరిధిలోకి రానున్నాయి. ఇవన్నీ సాకారమైతే మహానగరం మెట్రో నగరంగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యాటక, సాంస్కృతిక నగరంగా ఉన్న వరంగల్‌లో ప్రతిపాదించిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తే అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటుంది.

నగరంలో మెట్రో నియో:

  • అంచనా వ్యయం – రూ. 1100 కోట్లు
  • పూర్తి కావాల్సింది – 2 నుంచి మూడేళ్లలో
  • ఎక్కడ – కాజీపేట, హన్మకొండ, వరంగల్‌.

హైదరాబాద్‌ నగరంలో ఉన్నట్టు వరంగల్‌లోనూ మెట్రో రైలును తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మెట్రో నియో రైలు ప్రాజెక్టుకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. రూ. 1100 కోట్ల అంచనా వ్యయంతో కాజీపేట నుంచి వరంగల్‌ వరకు 15 కిలోమీటర్ల మేర నిర్మించే ఇందులో సగం నేలపై సగం ఆకాశ మార్గంలో నడిచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 22 రైల్వే స్టేషన్లు, 20 బస్సు పెట్టెలతో నడిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. రెండు మూడేళ్లలో సాకారం అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వెంట వెంటనే నిధులు మంజూరు చేస్తే మెట్రో వచ్చే అవకాశం ఉంది.

మూడు నక్షత్రాల హోటల్‌:

  • అంచనా వ్యయం – రూ. 25 కోట్లు
  • అవసరమైన స్థలం – 10 నుంచి 20 ఎకరాలు
  • ఎక్కడ – హన్మకొండ.

మడికొండలో మూడు నక్షత్రాల హోటల్‌తో సహా, హైదరాబాద్‌లోని హైటెక్స్‌ తరహాలో అంతర్జాతీయ సమావేశ, వాణిజ్య ప్రదర్శనల కేంద్రం (వైటెక్స్‌) నిర్మించేందుకు జూన్‌ 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. దీన్ని పీపీపీ మోడ్‌లో నిర్మించి నిర్వహించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌళిక వసతుల కల్పన సంస్థ భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది. మడికొండ ఐటీ పార్కు సమీపంలో ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే నగర వాసులు సేదతీరేందుకు, భారీ ప్రదర్శలు నిర్వహించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించవచ్చు.