న్యూజిలాండ్‌ – భారత జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ వెల్లింగ్టన్ వేదికగా ఆరంభమైంది. ఈ టెస్టులో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. తొలి సెషన్‌ మొత్తం క్రీజులో ఉండి ఈ రికార్డు నెలకొల్పాడు. 1990లో నేపియర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన మనోజ్‌ ప్రభాకర్‌ తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్‌ చేశాడు. మనోజ్‌ ప్రభాకర్‌ తర్వాత 30 ఏళ్లకు ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్(34; 84 బంతుల్లో 5×4) కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో అదే ఘనత సాధించాడు. వీరిద్దరు మినహా టీమిండియా ఓపెనర్‌ కివీస్ గడ్డపై టెస్టుల్లో తొలి సెషన్‌ ఆడిన ఆటగాళ్లు లేరు.

భోజన విరామం తర్వాత టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డింది. 41.1 ఓవర్‌లో హనుమ విహారి(7) జామీసన్‌ బౌలింగ్‌లో అవుటైయ్యాడు. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(38; 108 బంతుల్లో 4×4), రిషబ్ పంత్ (10) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం 55 ఓవర్లలో 122 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యా్చ్ నిలిచిపోయింది

అంతకుముందు తొలుత న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఓపెనర్‌ పృథ్వీషా(16), పుజారా(11), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(2) విఫలమయ్యారు. 35 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 90/4గా నమోదైంది. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జామీసన్‌ రెండు వికెట్లు తీయగా టిమ్‌సౌథీ, ట్రెంట్‌బౌల్ట్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. మయాంక్‌ అగర్వాల్‌ (34; 84 బంతుల్లో 5×4) ట్రెంట్‌బౌల్ట్ బౌలింగ్‌లో జామీసన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. జామీసన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్‌బౌల్ట్, సౌథీ చెరో వికెట్ దక్కించుకున్నారు.