నిజామాబాద్‌: ప్రేమికుడి వేధింపులను తట్టుకోలేక విషం తాగిన యువతి చికిత్స పొందుతూ 9 రోజుల అనంతరం మృతి చెందింది. కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. పోలీసుల కథనం ప్రకారం: నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండలం మాణిక్‌ భండార్‌ తండాకు చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ అభిలాష్, అదే తండాకు చెందిన కెతావత్‌ రాజేశ్వరి (19) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇటీవల అభిలాష్‌ మరో యువతితో ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలిసిన రాజేశ్వరి అతనితో గొడవ పడింది. దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రెండునెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లి ఓ జ్యూయలరీ షాప్‌లో జాబ్‌లో చేరింది.

అయితే అభిలాష్‌ తరుచూ ఫోన్‌ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించటంతో తిరిగి మార్చి 20న రాజేశ్వరి తండాకు వచ్చింది. అభిలాష్‌ నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో గతనెల 23న రాత్రి 8 గంటల సమయంలో విషం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి రాజేశ్వరి శనివారం మృతి చెందింది. విషయం తెలిసిన తండాలోని యువతి బంధువులు అభిలాష్‌ ఇంటిపై దాడి చేశారు. మృతురాలి తండ్రి దుబాయ్‌లో ఉన్నాడు. తల్లి, అనూష, అన్న తరుణ్‌ వ్యవసాయ పనులు చేస్తారు. పోలీసులు అభిలాష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.