వాళ్లిద్దరి వివాహమై ఇరవై రోజులు కూడా కాలేదు. పెళ్లి తర్వాత ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం భర్త భార్యను తీసుకుని తన అత్తగారింటికి వెళ్లాడు. కొత్త అల్లుడు వచ్చాడని ఆ అత్తమామలు అల్లుడికి కొసరి కొసరి వడ్డించారు. అల్లుడికి ఏంలోటు లేకుండా చూసుకున్నారు. తమ కూతురును గారాబంగా పెంచామని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అల్లుడిని కోరారు. దానికి ఆ అల్లుడు కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానన్నాడు. అయితే తల్లిదండ్రుల మీద బెంగపెట్టుకున్న ఆ నవ వధువు తాను రెండ్రోజులు తల్లి దగ్గరే ఉంటానని భర్తను కోరింది. భార్య కోరికను ఆ భర్త కాదనలేకపోయాడు. కానీ అదే అతడి కొంప ముంచింది. భర్త ఉదయం వాళ్లింటికి వెళ్లగా ఆయన భార్య సాయంత్రం వెళ్లింది. కానీ భర్తతో కాదు. ప్రియుడితో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిందీ ఘటన. మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ కు చెందిన మూర్తిరైక్వార్ కు ఉత్తరప్రదేశ్ లోని జలాన్ జిల్లా కు చెందిన రాహుల్ అనే యువకుడితో గతనెల 6న వివాహమైంది. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశాడు రైక్వార్ తండ్రి. అయితే పెళ్లై 18రోజులైన తర్వాత ఒక కార్యక్రమం నిమిత్తం రాహుల్, మూర్తి రైక్వార్లిద్దరూ రావలసిందిగా వధువు తండ్రి కోరాడు. ఆయన కోరిక నిమిత్తం వచ్చిన వారికి ఆ తండ్రి సపర్యలు చేశాడు. కొత్త అల్లుడికి ఏం లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. మరుసటి రోజు తాను ఇంటికి వెళ్లిపోతానని రాహుల్ చెప్పడంతో తాను రెండ్రోజుల తర్వాత వస్తానని మూర్తి చెప్పింది. దీంతో సరేనన్న రాహుల్ ఒక్కడే జలాన్ కు వెళ్లిపోయాడు.

రాహుల్ వెళ్లిన తర్వాత రైక్వార్ కూడా సాయంత్రం తన ప్రియుడితో పారిపోయింది. అదే గ్రామంలో ఉంటున్న భజ్జు యాదవ్ అనే వ్యక్తితో మూర్తికి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. అయితే పెళ్లికి ముందే వారిద్దరూ పారిపోవాలనుకున్నా అది కుదరలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన వారిద్దరూ పెళ్లి తర్వాత పారిపోయారు. వెళ్లే సమయంలో ఆ నవ వధువు తనతో పాటు రూ. 5 లక్షల విలువైన బంగారం రూ. 20వేల నగదు కూడా తీసుకెళ్లిందని భర్త ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.