టీఆర్‌ఎస్‌కు చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నోరు జారారు. స్వయాన తమ పార్టీ అధినేత కేసీఆర్‌పైకే విమర్శలు ఎక్కుపెట్టారు. ఆసక్తికరమైన ఈ సంఘటన నడికూడ మండలం కంఠాత్మకూర్‌లో గురువారం జరిగింది. కంఠాత్మకూర్‌లో రైతు వేదికను ప్రారంభించిన సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ: ‘‘నార్త్‌ ఇండియా రాష్ర్టాల నుంచి 130 రోజులుగా కేంద్రవ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్దఎత్తున తరలివచ్చి ఆందోళన చేస్తుంటే, పట్టించుకోని పుణ్యాత్ములు మన నరేంద్రమోదీ, కేసీఆర్‌ గారు. అసలు నేను ఆయనను అడుగుతున్నా.

ఈ రోజు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి, రైతులు బోరున ఏడుస్తూ రోడ్డున పడితే, వాళ్లను పిలిచి మాట్లాడకుండా దేశానికి ఏదో చేసినట్లు, ఇంకా ఏదో చేసినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదు.’ అని విమర్శించారు.కాగా, ధర్మారెడ్డి వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. గతంలో అయోధ్య రామాలయ నిర్మాణం విరాళాల సేకరణ మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.