కాళ్లకు కట్టిన కత్తితో ప్రత్యర్థి కోడి గుండెలను చీల్చడం కోడి పందేల్లో చూస్తూ ఉంటాం. కాళ్లకు కత్తి లేకున్నా ఎగిరి దాడిచేసే పుంజులను చాలానే చూశాం కానీ పెట్టలు ఇంత కోపాన్ని ప్రదర్శించవు. పెంపుడి కోడి తన యజమాని ప్రాణాలు తీసిన షాకింగ్‌ ఘటన. కోడి వద్ద నుంచి కు డ్లను సేకరిస్తున్న సమయంలో ఆస్ట్రేలియాలో అనూహ్య ఘటన జరిగింది. కోడిపెట్ట దాడిలో ఓ వృద్ధ మహిళ చనిపోయింది..

కోడి వద్ద నుంచి గుడ్లను సేకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. గుడ్లు తీస్తున్న సమయంలో ఆ వృద్ధురాలిపై కోడి దాడి చేసింది. పట్టలేని కోపంతో ఆమెపై విరుచుకుపడింది. పైకి ఎగిరి మరీ పొడిచింది. కోడి తన పదునైన ముక్కుతో మహిళ కాలి పిక్క భాగంపై దాడి చేసినట్లు తెలిసింది. అదే ప్రాంతంలో పదే పదే పొడవడంతో నరానికి రంధ్రం పడి రక్తం ధారలా కారింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. ఆమె తప్ప ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.