ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువ మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడ్డారు. ఉరి వేసుకుని తనువు చాలించారు. వివరాలు: బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో శుక్రవారం ఉరికి వేలాడుతూ కనిపించారు. చాలా సేపటి నుంచి ఆర్జూ అలికిడి వినిపించకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా విషయం బయటపడింది.

ఈ క్రమంలో ఆమె ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఆస్పత్రికి తరలించగా ఆర్జూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఘటనాస్థలంలో లభించిన సూసైడ్‌నోట్‌లో తన చావుకు తానే కారణమని ఆర్జూ పేర్కొన్నట్లు రాసి ఉందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు ఆమె సన్నిహితులను కూడా విచారిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.