ఏడు రాష్ట్రాల్లోని మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పేర్లతో ఫేస్‌బుక్‌లో 54 నకిలీ ఖాతాలు తెరిచాడు. వాటితో అశ్లీల వీడియోలు, అసభ్య వ్యాఖ్యలతో పోస్టులు పెట్టేవాడు. ఓ అధికారిణి పేరుతో ప్రారంభించిన ఖాతాతో అతని డొంక కదిలింది. సదరు మహిళా అధికారిణి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో అతని పాపం పండింది.

కృష్ణా జిల్లా పెదఓగిరాలకు చెందిన కూనపురెడ్డి మన్మోహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న 54 మంది మహిళా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పేర్లతో ఖాతాలు తెరిచాడు. మన్మోహన్ తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులే. చదువులో మంచి మెరిట్ స్టూడెంట్. ఇంటర్‌లో రాష్ట్రస్థాయి ర్యాంక్‌ సాధించాడు. విజయవాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసి సివిల్స్‌ లక్ష్యంగా ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు.

రెండో ప్రయత్నంలో గతేడాది రాత పరీక్షలో ఉత్తీర్ణుడు అయ్యాడు. అయితే ముఖాముఖిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర నిరాశ చెందాడు. ఆ నిరాశను దూరం చేసుకోవడానికి తప్పుదారి ఎంచుకున్నాడు. మహిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పేర్లతో ఖాతాలు తెరిచాడు. వాటిల్లోంచి ‘మీరు సాయంత్రాలు ఖాళీగా ఉంటున్నారా? అందమైన సాయంత్రాన్ని మరింత అందంగా గడుపుదామా? ప్రేమను మనసుకు నచ్చినవారికి పంచితేనే అందం, సరసమైనా విరసమైనా సరే సమఉజ్జీలు వుండాలి. మరి మీరు తయారా?’ అంటూ ఆ పోస్టులు చేయడం ప్రారంభించాడు.

చాలామంది తనతో చాటింగ్ చేస్తోంది మహిళ అనుకుని అతని ఉచ్చులో పడ్డారు. అయితే మన్మోహన్ పప్పులు ఎక్కువకాలం ఉడకలేవు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ ఐపీఎస్‌ అధికారిణి పేరుతో ఖాతా తెరిచాడు. దానిని గుర్తించిన సదరు మహిళా అధికారిణి తన పేరున వున్న ఫేస్‌బుక్‌ ఖాతాను గుర్తించి, సంస్థ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి తొలగింపజేశారు. అయితే అతను మళ్లీ ఖాతా తెరిచాడు. ఇలా ఆమె తొలగింపజేయడం అతను మళ్లీ సృష్టించడం జరిగింది. ఇలా నాలుగుసార్లు జరిగింది.

మరోసారి ఆమె పేరుతో ఖాతా తెరిచి అసభ్య పోస్టులు చేస్తుండడంతో అధికారిణి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అతడు ప్రారంభించిన ఖాతాలు అన్నింటినీ అధికారులు తొలిగించారు.

ఇక ముందు అధికారిణుల పేర్లతో ఎవరైనా ఖాతాలను ప్రారంభిస్తే వాటిని ఆమోదించవద్దని, తమ దృష్టికి తీసుకురావాలని ఫేస్‌బుక్‌ ప్రతినిధులకు సూచించారు. కోర్టు అనుమతితో మన్మోహన్‌ను కస్టడీకి తీసుకుని అతని నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు, విచారిస్తామని అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.మోహన్‌రావు తెలిపారు.