సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మెగా సూపర్ ఈవెంట్‌ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి లేడీ అమితాబ్ విజయశాంతి హాజరయ్యారు. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించారు.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ ‘‘1979 నుంచి 2020 వరకు సినిమాలతో లాంగ్ జర్నీ చేశాను. యాక్షన్, కామెడీ, హీరోయిన్ ఓరెంటెడ్ సినిమాలు చేశా. చిరంజీవితో చాలా సినిమాలు చేశా. అణగదొక్క బడ్డ మహిళలకు నేనున్నానని నా సినిమాలు చాటిచెప్పాయి. ఎవరో వస్తారు.. మనకేదో చేస్తారని కాదు.. ఈ వేదికపై నుంచి నా అక్క చెళ్లెలకు చెబుతున్నది ఒక్కటే. భయపడకండి రేపు జీవితం మీది. మహిళా శక్తులు మీరే. మీరు సాధించగలరు. ఆ నమ్మకం మీలో ఉంటుంది. మహిళల కోసం నా ఊపిరి ఉన్నంత వరకు మంచి సినిమాలు, పోరాటాలు చేయడానికి ప్రయత్నిస్తా. 1988లో మహేశ్ బాబు లిటిల్ సూపర్ స్టార్. పట్టుకుంటే కందిపోతాడు అన్నట్టు క్యూట్‌గా మహేశ్ ఉంటాడు ఆ బిడ్డ. కృష్ణ దర్శకత్వంలో మహేశ్ బాబుతో నేను నటించా. మళ్లీ ఇప్పుడు మహేశ్‌తో నటిస్తానని అనుకోలేదు.’’ అని అన్నారు.

విజయశాంతి ఇంకా మాట్లాడుతూ ‘‘ హీరో కృష్ణనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేశారు. నా మొదటి హీరో కృష్ణ. ఆంటి విజయనిర్మలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. నా సక్సెస్ పుల్ జీవితానికి కృష్ణనే అని గర్వంగా చెప్పుకుంటా. మహేశ్ బాబు సినిమాతో రీ ఎంట్రీ అనేది ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ కొడుకుతోనూ నటిస్తా. మూడు జనరేషన్ల హీరోలతో సినిమా చేసినట్టు అవుతుంది. మహేశ్ 24 కేరక్టర్ బంగారం. ఒక్క మాటలో చెప్పాలంటే జెంటిల్‌మెన్. సూపర్ స్టార్ అనే పదానికి అర్థం మహేశ్. అంచెలంచెలుగా ఎదగడం, ఒదగడం, నేర్చుకోవడం, మీ అభిమానాన్ని సంపాదించడం మహేశ్ కంటే మించిన వారు లేరని అనుకుంటున్నా. కొత్తదనం కావాలని ప్రతి సినిమాకు నేర్చుకుంటూ వచ్చాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబేనా నటించింది అనే ఆశ్చర్యం కలుగుతోంది.’’ అని అన్నారు.