పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కుటుంబం తో ప్రాణహాని ఉందని పుట్ట శరణ్య అనే యువతి బుధవారం నాడు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. తాను ఇష్టపడి దీకొండ రవికిరణ్‌ను వివాహం చేసుకున్నానని, ఈక్రమంలో తమకు రక్షణ కల్పించాలని, రామగుండం పోలీసు కమిషనర్‌కు ఆదేశించాలని మానవ హక్కుల కమిషన్‌కు విన్నవించారు. పెద్దపల్లి జిల్లా మంథని కి చెందిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ చిన్నాన్న కొడుకు ఐన తమ్ముడు పుట్ట ముఖేష్ కూతురు పుట్ట శరణ్య అదే పట్టణానికి చెందిన దీకొండ రవికిరణ్ ను ప్రేమించింది.

వీరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొంటున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడం, రవికిరణ్ పేదవాడు కావడంతో వీరికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 15న వరంగల్ జిల్లాలో ఒక దేవాలయం లో వివాహం చేసుకొని రక్షణ కొరకు బుధవారం నాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు గట్టు లా ఛాంబర్స్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. తమకు తమ పెద్దనాన్న, పెద్దపల్లి జడ్పి చైర్మన్ అయిన పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, తమ తండ్రి పుట్ట ముఖేష్, తల్లి పుట్ట పద్మ, తమ్ముడు పుట్ట సన్నిత్‌ల నుంచి రక్షణ కల్పించాలని మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.