భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడం కళ్లారా చూసిన భర్త రగిలిపోయి రోకలిబండతో ఆమె తలపై బాది హతమార్చిన సంఘటన కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శివశంకర్‌ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలత (28) అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ఏడేళ్ల బాలుడు మురళి, ఐదేళ్ల బాలిక కీర్తన ఉన్నారు. పట్నం గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తితో హేమలత గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తోంది. ఈ విషయమై పలుమార్లు పద్దతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించడం జరిగింది.

అయినా ఆమె ఖాతరు చేయలేదు బుధవారం అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజినేయులుతో కలసి ఉండడం కళ్లారా చూసిన శివశంకర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పక్కనే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి భయపడిపోయిన రామాంజినేయులు పారిపోయాడు. ఆ వెంటనే తన మామ (హేమలత తండ్రి) గోపాలప్పకు నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు అందుకే చంపేశానంటూ ఫోన్‌ చేసి చెప్పాడు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పట్నం ఎస్సై సాగర్‌ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌ తరలించారు.