ఆమెకు ఏడేళ్ళ క్రితం పెళ్ళైంది. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే భర్తతో విభేదాల కారణంగా అతనికి దూరంగా ఉంటోంది. ఆ పరిస్థితుల్లో మాయ మాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళి పేరెత్తగానే పరారయ్యాడు. హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరిలో ఆ సంఘటన చోటుచేసుకుంది..

వివరాలిలా ఉన్నాయి: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ వివాహిత(23) భర్తతో విభేదాల కారణంగా పుట్టింటికి చేరింది. కాగా, ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీ ప్రాంతానికి చెందిన ఆఫన్(19) అనే యువకుడు వంట పనులు చేసుకుంటూ జవహర్‌నగర్‌లో నివిసిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు పరిచయమైన ఆఫన్ పెళ్ళి చేసుకుంటానని, పిల్లలకు తండ్రిగా ఉంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. 

అంతకుముందే అతను తరచూ కాలనీకి రావడాన్ని గమనించిన కాలనీవాసులు ప్రశ్నించడంతో ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నట్లు వారికి కూడా చెప్పాడు. ఇక ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.