కొడకండ్ల: మండల కేంద్రంలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మొదటి అడుగుగా గురువారం రాష్ట్ర, జిల్లా అధికారులు కొడకండ్లను సందర్శించి పార్కు ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. అనంతరం మరమగ్గ కార్మికులను కలిసి మాట్లాడారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఓఎస్‌డీ టి.శాంత, జిల్లా అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, చేనేత జౌళి శాఖాధికారి ఎం.సాగర్‌, టీఎస్‌ఐపాస్‌ జోనల్‌ మేనేజర్‌ రాథోడ్‌, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు కొడకండ్ల ఆదర్శ పాఠశాల సమీపంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 9 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. స్థలం చదును, పార్క్‌ ఏర్పాటుకు అనువైన వసతులపై స్థానిక అధికారులు, సర్పంచి మధుసూదన్‌, పద్మశాలి సంఘ నాయకులతో చర్చించారు. అనంతరం కొడకండ్ల మరమగ్గ పరిశ్రమను పరిశీలించి కార్మికులు, నేతన్నలను వస్త్ర తయారీ, ముడి సరకు లభ్యత, ఉత్పత్తి తీరు, మార్కెటింగ్‌ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కొడకండ్ల మండలంతోపాటు చుట్టుపక్కల మండలాల చేనేత కార్మికులందరూ సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకొని పార్క్‌ ఏర్పాటులో వారి భాగస్వామ్యం, వలస వెళ్లిన వారిని రప్పించే అవకాశాలు తదితర విషయాలపై చర్చించాలని అధికారులు స్థానిక పద్మశాలి సంఘ నాయకులకు సూచించారు. త్వరలో నివేదిక సిద్ధం చేసి పార్క్‌ ఏర్పాటు వేగవంతం చేయనున్నట్లు అధికారులు వివరించారు. పరిశీలనలో స్థానిక తహసీల్దార్‌ యాకయ్య, రెవెన్యూ సిబ్బంది, పద్మశాలి సంఘం నాయకులు వెంకటనారాయణ, నవీన్‌, పాండురంగం తదితరులు పాల్గొన్నారు.