అతడో ప్రభుత్వ ఉద్యోగి ముగ్గురు భార్యలను మెయింటెన్ చేస్తున్నాడు. అయితే బాహ్యప్రపంచానికి తెలిసింది మాత్రం అతడి ఇద్దరి పెళ్లాళే. మూడో పెళ్లాం వ్యహారం గురించి సీక్రెట్ గా ఉంచాడు. ఇలా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయ్. అతడి ముగ్గురు భార్యలూ స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగారు. ముగ్గురు భార్యల రాజకీయం వారి ముద్దుల మొగుడి ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. మధ్యప్రదేశ్ లోని ​కటాడ గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సుఖ్ రామ్ గౌడ్‌కు కుసుమ్ కలి​, గీతా భాయ్, ఊర్మిళా సింగ్ అనే ముగ్గురు భార్యలు ఉన్నారు 30సంవత్సరాల క్రితం కుసుమ్ కలిని, దశాబ్దం క్రితం గీతని, కొన్నాళ్ల క్రితం ఊర్మిళను సుఖ్ రామ్ పెళ్లాడాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముగ్గురు భార్యలు ఒకే గ్రామంలో ఉంటున్నారు కానీ వేర్వేరు ఇళ్లలో ఉంటారు.

అయితే త్వరలోమధ్యప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో సర్పంచ్ పదవికి సుఖ్ రామ్ ముగ్గురు భార్యలు నామినేషన్ వేశారు. పిపర్​ఖండ్ గ్రామ సర్పంచ్​ పదవికి సుఖ్ రామ్​ ఇద్దరు భార్యలు (కుసుకలి, గీత) ఒకరిపై ఒకరు పోటీ పడుతుండగా మరో భార్య ఊర్మిళ జన్‌పద్ పంచాయతీ వార్డ్ మెంబర్ పదవి కోసం బరిలోకి దిగింది. అయితే రూల్స్ ప్రకారంః అధికారులకు ముగ్గురు భార్యల వివరాలు ఇవ్వాల్సి ఉండగా సుఖ్ రామ్ మాత్రం ఇద్దరి సమాచారం మాత్రమే ఇచ్చాడు. మూడో భార్య గురించి మాత్రం బయటపెట్టలేదు.

అయితే సర్పంచ్ పదవికి ఒకరిపై ఒకరు పోటీపడుతున్న ముగ్గురు మహిళలు తమ ఎన్నికల నామినేషన్ పత్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుఖ్‌రామ్ సింగ్ తమ భర్తని పేర్కొన్నారు. నామినేషన్ పత్రంలోని భర్త కాలమ్‌లో ముగ్గురూ ఒకే వ్యక్తి పేరు రాయడంతో విషయం బయటపడింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సుఖ్ రామ్ పై క్రమశిక్షణ రాహిత్య చర్యలు చేపట్టారు. సస్పెండ్​ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారంపై దేవ్‌సర్ జనపద్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బీకే సింగ్ విచారణ చేపట్టి.. జిల్లా పంచాయతీ సీఈఓకు నివేదికను సమర్పించారు. అతడిపై సస్పెన్షన్ సహా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. ఉద్యోగుల కుటుంబసభ్యులు లేదా బంధువులు ఎవరైనా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తే తమ వివరాలను వెల్లడించాలని ఇప్పటికే స్పష్టం చేసినట్టు బీకే సింగ్ తెలిపారు. షోకాజ్ నోటీసు జారీచేసినా సుఖ్ రామ్ స్పందించలేదని,దీంతో అధికారుల ఆదేశాల ప్రకారం నివేదికను సమర్పించి అతడిపై సస్పెన్షన్ సహా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్టు బీకే సింగ్ చెప్పారు.