చెట్లతోనే మానవ మనుగడ ముడిపడివుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆరో విడత హరితహారం పురస్కరించుకుని శుక్రవారం మంత్రి జిల్లాలోని ములుగు మండలం జాకారం, బండారుపల్లి గ్రామాల్లో, వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లె గ్రామం, వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కేంద్రంలోని డివిజనల్ అటవీ అధికారి, కలెక్టరేట్ వద్ద మొక్కపు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్ష్యం మేరకు మొక్కలు నాటుకొని, వాటిని సంరక్షించుకొని ఆకుపచ్చ తెలంగాణ రూపకల్పన చేద్దామన్నారు. భావి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందన్నారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలన్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని, చెట్లను పెంచితేనే సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు.