వనదేవతలు సమ్మక్క , సారలమ్మల మహాజాతర ముగిసి నెల రోజులు దాటుతున్నా మేడారానికి వచ్చే భక్తులు ఏమాత్రం తగ్గడం లేదు. మేడారానికి ఎప్పుడెళ్లినా అమ్మలు కరుణిస్తారనే భావన భక్తుల్లో పెరిగిపోయింది. దీంతో వనదేవతల సన్నిధికి నిత్యం భక్తుల రాక కొనసాగుతూనే ఉంది. సెలవు రోజయిన ఆదివారం దేవతల దర్శనానికి ఊహించని రీతిలో తరలివచ్చారు.

జంపన్నవాగు ప్రవాహంలో చిన్నారులు, యువతీ, యువకులు కేరింతలు కొట్టారు. కల్యాణకట్టలలో తలనీలాలర్పించారు. అమ్మవార్లకు ఎత్తుబెల్లం, కొబ్బరి, పూలు పండ్లు, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం 7 గంటల వరకే గద్దెలపై భక్తులు పూర్తిగా నిండిపోయారు. రాత్రి 8 గంటల వరకు భక్తుల రాక కొనసాగింది. ప్రధాన పూజారులు జగ్గారావు, ముణీందర్, సారయ్య, కిరణ్ తదితరులు గద్దెల ప్రాంగణంలో ఉండి భక్తులకు సేవలందించారు .

వ్యాపారాలు కళకళ:

పెరిగిన భక్తులతో మేడారంలో వ్యాపారం జోరందుకుంది. మధ్యాహ్నానికి దుకాణాల్లో కోళ్లు ఖాళీ అయిపోయాయి. కరోనా వైరస్ భయంతో దుకాణదారులు పరిమిత సంఖ్యలో కోళ్లను దిగుమతి చేసుకున్నారు. కొబ్బరి , బెల్లం , పూలు , పండ్లు , పూజా సామగ్రి వ్యాపారం ఎవరూ ఊహించని రీతిలో జరిగింది. వేసవి తాపంతో శీతలపానియాలు , నీళ్లు , మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి .