మండలంలోని మేడారం జాతర అభివృద్ధికి భూములు సేకరణ చెయ్యాడానికి గురువారం డీఆర్వో రమాదేవి, తహసీల్దార్ పాలకుర్తి బిక్షంతో కలసి మేడారంలో పర్యటించారు. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. మా ప్రాణాలైన వదులుకుంటాం కానీ భూములను వదులుకోం అని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్వో రమాదేవి, రెవెన్యూ సిబ్బంది మేడారానికి వెళ్లగా రైతులు, మహిళలు వారి వద్దకు వెళ్లి భూములు ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు.

భూములు సర్వే చేయనీయకుండా అడ్డుకున్నారు. సర్వే లేదు ఏం లేదు ఇక్కడి నుండి వెళ్లి పోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన భూములకే దిక్కు లేదు. ఇప్పుడు తీసుకొన్న భూములకు దిక్కెవరని మండిపడ్డారు. మీరు రైతులకు సహకరించాలని అనుకుంటే రెండవ పంట నష్టపోతున్న రైతులకు నష్ట పరిహారం ఇప్పించండి. అంతే కానీ పేదల భూములు లాక్కోవద్దని తేల్చి చెప్పారు.

మేడారంలో పేద రైతుల భూములు తీసుకొని, భవనాలు, విచ్చలవిడిగా రోడ్లు నిర్మించి మా బ్రతుకులు రోడ్డు పాలు చేస్తున్నారని అన్నారు. దీంతో డీఆర్వో రమాదేవి చేసేది ఏమిలేక తిరిగి వెల్లి పోయారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మహిళ రైతులు, పూజారులు, అభ్యుదయ సంఘం, యూత్ అధ్యక్షులు సిద్దబోయిన భోజరావు, తదితరులు పాల్గొన్నారు…