రంజని (పేరు మార్చాం) ప్రేమ వివాహం చేసుకుని ఎన్నో ఆశలతో, అంచనాలతో భర్తతో కలిసి నగరంలో కొత్త జీవితం ప్రారంభించింది. భర్త ఏ పనీ చేయకపోయినా ప్రేమగానే చూసుకునేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. చేతిలో ఉన్న డబ్బు ఖర్చయిపోయింది. భర్తకు ఆమె మీదున్న మోజూ తీరిపోయింది. అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి. అవి తీవ్రమై, ఓ అర్ధరాత్రి అతడు ఇంట్లో నుంచి చెప్పాబెట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో ముగ్గురు పిల్లలతో ఆమె రోడ్డున పడింది. కన్నవాళ్లకు ఫోన్‌ చేస్తే కనికరించలేదు. పిల్లల్ని వదిలేసి వస్తే ఆలోచిస్తామన్నారు.

ఆ పని చేయలేక, తన కష్టంతోనే వాళ్లను పోషించుకోవాలని నిర్ణయించుకుంది. పనికోసం ఎక్కడెక్కడో తిరిగింది. ఎక్కడా దొరకలేదు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో, చాలా కాలంగా తనపై కన్నేసి ఉన్న ఓ మగాడికి తలొంచింది. పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టేందుకు అతడి ‘ఆకలి’ తీర్చింది. ఇక అప్పటి నుంచి పని కోసం యత్నించడం మానేసి ఇదే వృత్తిని కొనసాగిస్తోంది. ఇలాంటి స్థితిలో ఆ అభాగ్యురాలిపై లాక్‌డౌన్‌ పిడుగులా పడింది. చేతిలో చిల్లిగవ్వలేక ఆమెతో సహా పిల్లలకు నోట్లోకి నాలుగువేళ్లు వెళ్లి నెలన్నర దాటింది. అప్పడిగితే ఇచ్చేవాళ్లు లేరు. అడుక్కుందామంటే పెట్టేవాళ్లు లేరు. ప్రభుత్వ సహాయం పొందేందుకు రేషన్‌ కార్డు లేదు. పిల్లల బాధ చూడలేక, ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయిన రంజని లాంటి అభాగ్యులు నగరంలో వేల సంఖ్యలో ఉన్నారు.

తండ్రి, భర్త, ప్రేమికుడు.. పేరేదైనా, మగాడి చేతిలో మోసపోయి చావలేక ఈ వృత్తిలో బతుకెళ్లదీస్తున్న వీళ్లను అనూహ్యంగా వచ్చిపడ్డ లాక్‌డౌన్‌ ఆగం చేస్తోంది. బయటికొచ్చి ప్రభుత్వాన్ని సాయం అడగాలంటే భయం.. ఎక్కడ పునరావాస కేంద్రానికి తరలిస్తారోనని. ఆ తర్వాత తమ పిల్లల పరిస్థితి ఏంటా అనే ఆందోళన. మరికొందరి పరిస్థితి మరీ దారుణం. ఈ వృత్తి వల్ల సంక్రమించిన రోగాలకు మందులు తీసుకునేందుకు కూడా డబ్బులేదు. దీంతో ఆ రోగాలు ముదిరి ప్రాణం మీదికి వస్తోంది. ఈ విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలిస్తే, ఆ మాత్రం నీడ కూడా దూరమవుతుందని గుట్టుగా గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ వేళ అన్ని వర్గాల వారికీ వరాలు గుప్పిస్తున్న ప్రభుత్వాలు తమను మాత్రం గాలికొదిలేశాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మమ్మల్నీ పట్టించుకోండి:

మాకు వేరే దిక్కులేక ఈ రొంపిలోకి వచ్చి పడ్డాం. ఇందులోకొచ్చి సంపాదించి మిగుల్చుకున్నదేమీ లేదు. ఏ పూటకాపూట బువ్వ కోసం వెతుక్కోవడమే. మా కష్టాలు చెప్పినా ఎవరు సానుభూతి చూపిస్తారు. మాకు మేమే ఒకరికొకరం సాయం చేసుకుందామన్నా, అందరిదీ ఇదే పరిస్థితి. మాకెవరికీ రేషన్‌ కార్డుల్లేవు. అయినోళ్లంతా మమ్మల్ని ఎప్పుడో దూరంపెట్టారు. దయచేసి ఎవరైనా మా కమ్యూనిటీ వాళ్ల ద్వారా బియ్యం, పప్పులు ఇప్పించండి. మా పిల్లలకైనా కడుపు నింపుతాం. మేమూ మనుషులమే.. మమ్మల్నీ పట్టించుకోండి. -ఓ సెక్స్‌ వర్కర్‌

పస్తుల్లో 30వేల మంది:

నగరంలో 30వేల మంది సెక్స్‌వర్కర్లు ఉంటారని ఓ అంచనా. లాక్‌డౌన్‌తో వీళ్లంతా ఉపాధి కోల్పోయి.. పస్తులుంటున్నారు. వారంతా బతుకుదెరువు కోసం నగర బాట పట్టినవారే. అందరూ ఎవరో ఒకరి చేత మోసపోయి ఈ వృత్తిలోకి వచ్చిన వారే. వీరిలో చాలామంది రకరకాల జబ్బులతో బాధ పడుతున్నారు. వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలి. రామ్మోహన్‌, హెల్ప్‌ ఫౌండేషన్