నేరస్థులను అతిథులుగా మాదిరిగా చూస్తున్నారు

ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బిఎస్‌పి అధినేత్రి మాయావతి తెలిపారు. తెలంగాణలో దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. యుపిలో యోగి ప్రభుత్వం నిద్రపోతోందని మండిపడ్డారు. ఢిల్లీ, యుపి పోలీసులు హైదరాబాద్ పోలీసుల నుంచి ప్రేరణ పొందాలని సూచించారు.

భారతదేశంలో దురదృష్టవశాత్తు నేరస్థులను అతిథులుగా మాదిరిగా చూస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను కాల్చిన ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున ఐదుగంటల ప్రాంతంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉన్నావో అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళ్తుండగా ఆమెపై నిందితులు సజీవ దహనానికి యత్నించిన విషయం తెలిసిందే. ఆమె 90 శాతం కాలిన గాయాలతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను అత్యాచారం చేసిన నిందితులు బెయిల్ పై విడుదలై హత్య చేయడానికి ప్రయత్నించారు.