తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన వైనం..

మద్యం మత్తులో రైల్వేట్రాక్‌పై టిక్‌టాక్‌ చేస్తూ ఓ యువకుడు ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మల్కాజ్‌గిరిలోని దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన దినేష్‌(18) స్నేహితులతో కలిసి ఈనెల 15వ తేదీన మద్యం తాగాడు. అనంతరం రాత్రి 8 గంటలకు అదే ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పైకి వచ్చి గూడ్స్‌ వెళ్తున్న సమయంలో టిక్‌టాక్‌ చేస్తుండగా రైలు ఢీకొనడంతో గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి గాయాలైనట్లు పేర్కొని అతడి స్నేహితులు దినేష్‌కు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై అదేరోజు రాత్రి లోకో పైలెట్‌ జీఆర్పీ పోలీసులకు తెలియజేయగా దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల తెలిపారు.