రాష్ట్రంలో మరో యువతి మిస్సింగ్ అయ్యింది. అయితే ఈ మేరకు సదరు యువతి సంబంధీకులు వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అది కూడా జీరో ఎఫ్ఐఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి జీరో ఎఫ్ఐఆర్‌ కావడం విశేషం.

వివరాలు: వరంగల్‌ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం.. గోవిందాపూర్‌కు చెందిన 24 సంవత్సరాల ఓ యువతి కనిపించడం లేదు. దీంతో సదరు యువతి చిన్నాన్న వరంగల్‌లోని సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం నుంచి ఆమె కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, గోవిందాపూర్ శాయంపేట పీఎస్ పరిధిలోకి వస్తుంది. కానీ ఆ యువతి చిన్నాన వరంగల్ సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబేదారి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత దాన్ని శాయంపేట పీఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. మిస్సింగ్ అయిన యువతి ఫోన్ నంబర్ కాల్ డేటా ఆధారంగా రెండు పోలీస్ స్టేషన్ల వారు ఈ కేసు విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సుబేదారి పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు.