ఓ యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పై ఆమెను గర్బవతిని చేసి పెళ్లికి నిరాకరించాడు. చివరికి పెళ్లి చేసుకొని తనకు సంబంధం లేదంటూ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి 22 సంవత్సరాలు. ఆ యువతి తన ఇంటి వద్ద స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన లంక చినబాబు అనే యువకుడు ఆమెను వీడియో తీశాడు. ఆ తర్వాత వీడియోను ఆమెకు చూయించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా పలుమార్లు ఆ యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్బం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరగా నిరాకరించాడు. 

ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆమె డిసెంబర్ 18 న కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వగా ఆ యువతిని వివాహం చేసుకున్నాడు. నెల రోజుల పాటు బాగానే ఉన్న చినబాబు ఇటీవల యువతితో గొడవకు దిగాడు. గర్భానికి తనకు సంబంధం లేదని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని యువతి మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనని చినబాబు మోసం చేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.