రౌడీమూకల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. తప్పించుకు తిరుగుతున్న రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు అర్థరాత్రి పోలీసులు పక్కా సమాచారంతో అతని ఇంటికి వెళ్లారు. కాన్పూర్‌ సమీపంలోని డిక్రూ గ్రామంలో అతడు ఉంటున్న నివాసానికి చేరుకుంటున్న క్రమంలోనే ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీసు బృందంపై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60 క్రిమినల్‌ కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాల్పులకు పాల్పడిన నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.